ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక నిజమైన మిత్రదేశం అమెరికా మాత్రమేనంటూ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కౌంటర్ ఇచ్చారు. అమెరికా తమకు అత్యంత కీలక భాగస్వామి అనడంలో ఎలాంటి సందేహం లేదని.. అయితే తమకు భారత్ వంటి అత్యంత నమ్మకమైన, సన్నిహిత దేశాలు కూడా ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక శక్తిమంతమైన మిత్రుడు అమెరికానే' అని పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
భారత్ మద్దతు అమూల్యం..
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై నెతన్యాహు తాజాగా స్పందిస్తూ.. 'అమెరికా అందిస్తున్న సహకారం మాకు నిజంగానే ఎంతో విలువైనది. కానీ ఇజ్రాయెల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుండి కూడా బలమైన మద్దతు లభిస్తోంది. మాకు భారత్ లాంటి మరికొన్ని అద్భుతమైన మిత్రదేశాలు ఉన్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇజ్రాయెల్‌కు ఎంతో ఆదరణ, ప్రజా మద్దతు ఉంది. ప్రపంచంలోని పలువురు అగ్రనేతలు బహిరంగంగా చెప్పకపోయినా.. వ్యక్తిగతంగా ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నారు' అని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్‌కు దొరికిన అత్యంత సన్నిహిత మిత్రుడిగా నెతన్యాహు కొనియాడారు. జేడీ వాన్స్‌పై తనకు పూర్తి గౌరవం ఉందని.. అయితే ఆయన చెప్పే ప్రతి విషయంతో తాను ఏకీభవించాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు.


