న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) లో సాగుతున్న డిజిటల్ పైరసీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తన ఒత్తిడిని మరింత పెంచింది. యాప్ వేదికగా అక్రమంగా చలనచిత్రాలు, వెబ్ సిరీస్ లు, ఇతర కాపీరైట్ కంటెంట్ సర్క్యులేట్ అవుతుండటంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) శనివారం కీలక నోటీసులు జారీ చేసింది. పైరసీ గ్రూపులు, ఛానళ్లపై కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందించడం కాకుండా.. ముందస్తుగానే (Proactive) కఠిన చర్యలు తీసుకోవాలని టెలిగ్రామ్ యాజమాన్యాన్ని ప్రభుత్వం గట్టిగా ఆదేశించింది.
15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలి
తాజా ఆదేశాల ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ లలో పైరసీ కట్టడికి తీసుకున్న చర్యలపై రాగల 15 రోజుల్లోగా 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (ATR) సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. ఐటీ చట్టం 2000, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఇంటర్మీడియరీ సంస్థలు పాటించాల్సిన కనీస నిబంధనలను (Due Diligence) టెలిగ్రామ్ గుర్తు చేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. కంటెంట్ క్రియేటర్లు, చలనచిత్ర పరిశ్రమ, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల ఆర్థిక ప్రయోజనాలను రక్షించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రియాక్టివ్ విధానం సరిపోదు
గతంలో కేవలం ప్రభుత్వాలు లేదా ప్రొడక్షన్ హౌస్ లు గుర్తించి ఇచ్చిన లింకులను మాత్రమే టెలిగ్రామ్ తొలగిస్తూ వచ్చింది. అయితే, ఈ కేవలం 'రియాక్టివ్' పద్ధతి ఇకపై చెల్లదని, టెలిగ్రామ్ తన సొంత సాంకేతికతతో పైరసీ ఛానళ్లను గుర్తించి బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ తప్పు మాత్రమే కాదని, కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం అది పక్కాగా క్రిమినల్ నేరమని కేంద్రం హెచ్చరించింది.
ఇటీవలే నీట్ (NEET) పరీక్షల రీ-ఎగ్జామ్ కు ముందు పేపర్ లీక్ ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా టెలిగ్రామ్ పై కేంద్రం వారం రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ముగిసిన కొద్ది రోజులకే ఇప్పుడు పైరసీ ఛానళ్ల కట్టడిపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరిస్తుండటం డిజిటల్ మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సరైన నివేదిక ఇవ్వని యెడల చట్టపరమైన తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రం తేల్చి చెప్పింది.


