హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

నాయకుల సమక్షంలో ప్రత్యేక పూజలు

ఈ దర్శన కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, అనిల్ జాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేసీఆర్ హయాంలోనే బోనాలకు గుర్తింపు – కేటీఆర్

అమ్మవారి దర్శనం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసినప్పటికీ ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతీ ఆలయ కమిటీకి నిధులు విడుదల చేసిందని గుర్తుచేశారు.

అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సుమారు రూ. 1,800 కోట్లతో దివ్యక్షేత్రంగా పునర్నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతన్నలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సంతోషాలతో వర్ధిల్లాలని మహంకాళి అమ్మవారిని వేడుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Aug 2026 | 06:40 PM IST
Tags: