న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ల తయారీ భాగస్వామి, ప్రముఖ భారతీయ దిగ్గజం టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) లో జరిగిన భారీ డేటా లీక్ వ్యవహారంపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. మార్కెట్లోకి ఇంకా విడుదల కాని యాపిల్ ప్రతిష్టాత్మక ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) మోడళ్లకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు లీక్ కావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ డేటా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ అధికారికంగా వెల్లడించారు.
డార్క్ వెబ్‌లో యాపిల్ రహస్యాలు
తమిళనాడులోని హోసూర్ పరిధిలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ నుండి ఒక సైబర్ క్రిమినల్ రాన్సమ్‌వేర్ గ్రూప్ ఈ డేటాను దొంగిలించి, డార్క్ వెబ్ (Dark Web) లో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఈ లీకైన ఫైళ్లలో ఐఫోన్ 18 ప్రో మోడళ్ల నమూనా ఫోటోలు, వాటి రూపకల్పనకు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నాయి. వీటితో పాటు యాపిల్ కంపెనీ బహిరంగంగా వెల్లడించని అంతర్జాతీయ సప్లయర్లు, విడిభాగాల తయారీదారుల (Components Lists) రహస్య జాబితాలు కూడా లీక్ కావడం టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. యాపిల్ ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో తన సరికొత్త ఐఫోన్ సిరీస్ మోడళ్లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేస్తుంది. ఈ లోపే ఐఫోన్ 18 ప్రో మోడళ్ల తయారీ గుట్టు రచ్చకెక్కడం గమనార్హం.
రంగంలోకి దిగిన గ్లోబల్ కన్సల్టెంట్స్.. సీఈఆర్టీ-ఇన్ నిఘా
భారతదేశంలో కంప్యూటర్ సెక్యూరిటీ, సైబర్ దాడుల కట్టడికి ప్రధాన నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (CERT-In) కు ఈ లీక్ వ్యవహారాన్ని టాటా యాజమాన్యం నివేదించింది. గ్లోబల్ సప్లై చైన్ పరిధిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించే యాపిల్ వ్యాపార ప్రతిష్టకు ఈ ఘటన పెద్ద సవాల్‌గా నిలిచింది.
డేటా లీక్ తీవ్రతను గమనించిన టాటా ఎలక్ట్రానిక్స్.. నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ సైబర్ దాడి ఏ విధంగా జరిగింది, ఎంతవరకు డేటా చోరీకి గురైందనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఆడిట్ కన్సల్టెంట్ సంస్థను రంగంలోకి దించింది. ఈ సైబర్ దాడిలో కేవలం యాపిల్ మాత్రమే కాకుండా టెస్లా (Tesla), క్వాల్‌కామ్ (Qualcomm), టీఎస్ఎంసీ (TSMC) లాంటి మరికొన్ని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన కీలక పత్రాలు కూడా డార్క్ వెబ్ లో ప్రత్యక్షమవ్వడం అంతర్జాతీయ పారిశ్రామిక వర్గాలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కేంద్ర ఐటీ శాఖ పర్యవేక్షణలో సాగుతున్న ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి భద్రతా చర్యలు తీసుకోనున్నారు


