కాన్పూర్: సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఒక ఐఐటీ టాపర్ జీవిత ప్రయాణం దేశవ్యాప్తంగా విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. కన్నవారి ఆరోగ్యం, వారి ఆనందం కంటే విదేశాల్లో సంపాదించే కోట్ల రూపాయల ప్యాకేజీ ఏమాత్రం ఎక్కువ కాదని నిరూపించిన వివేక్ శర్మ కథనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఐఐటీ బాంబే (IIT Bombay) లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఈ యువకుడు.. ఏటా సుమారు రూ.2.9 కోట్ల వేతనంతో లభించిన అమెరికా ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ప్రస్తుతం తన సొంత ఊరిలో, ఇంటి కిందే ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతూ తల్లిదండ్రుల సేవలో ఉండిపోయిన వృత్తాంతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

తల్లిదండ్రుల జీవితకాల త్యాగం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌కు చెందిన ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వివేక్ శర్మ వచ్చారు. ఆయన తండ్రి రైల్వే క్లర్క్‌గా పని చేయగా, తల్లి పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఇల్లు గడిపేవారు. వివేక్ చదువు కోసం ఆ దంపతులు తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశారు. నగలు సైతం అమ్మి, ప్రతి రూపాయి పొదుపు చేస్తూ కుమారడిని కోటా (Kota) లో చదివించి ఐఐటీ బాంబేలో సీటు సాధించేలా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన వివేక్.. రాత్రింబగళ్లు శ్రమించి కాలేజీలోనే టాప్ ర్యాంక్ తో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.

చేతికందిన కలల ఉద్యోగం.. ఇంతలోనే విషాదం

వివేక్ అసాధారణ ప్రతిభను గుర్తించిన శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక ప్రతిష్టాత్మక స్టార్టప్ కంపెనీ.. వార్షికంగా 2,40,000 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.2.9 కోట్లు) భారీ ఆఫర్ ఇచ్చింది. వీసా స్పాన్సర్‌షిప్, గ్లోబల్ కెరీర్ ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. అమెరికా విమానం ఎక్కడానికి కొద్దిరోజుల ముందే ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. వివేక్ తండ్రి హార్ట్ ఎటాక్ (గుండెపోటు) బారిన పడగా, అదే సమయంలో తల్లికి క్యాన్సర్ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

తల్లిదండ్రులే నా అతిపెద్ద కంపెనీ

ఆ క్లిష్ట పరిస్థితుల్లో వివేక్ కెరీర్ కంటే కన్నవారి ప్రాణాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని, ఉద్యోగాన్ని వదులుకున్నాడు. మొదట కాన్పూర్‌లోనే ఒక చిన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను ఆసుపత్రులకు తిప్పాడు. వైద్య ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు.. కన్నవారికి నిరంతరం అందుబాటులో ఉండటం కోసం తన ఇంటి కిందే ఒక చిన్న కిరాణా షాప్ (Sharma General Store) ప్రారంభించాడు.

ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ బియ్యం, పప్పులు అమ్ముతుండటం చూసి మొదట్లో కొందరు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత స్థానికులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. దుకాణం నడుపుకుంటూనే.. మరోవైపు పేద పిల్లలకు ఉచితంగా కోడింగ్ (Coding) నేర్పిస్తూ సామాజిక బాధ్యత చాటుకుంటున్నాడు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండేతో పాటు పలువురు ప్రముఖులు ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. "నా తల్లిదండ్రులే నా జీవితంలో అతిపెద్ద కంపెనీ, వారి కంటే పెద్ద ప్యాకేజీ ప్రపంచంలో ఏదీ లేదు" అని వివేక్ శర్మ సగర్వంగా చెబుతున్న మాటలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Read latest Viral News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST