న్యూఢిల్లీ / హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పలువురు పార్లమెంట్ సభ్యులతో కలసి పార్లమెంట్ భవనంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో బుధవారం సమావేశమయ్యారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సానుకూల తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పర్యావరణ అనుమతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చించిందని సీఎం వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోత‌ల‌పై రూ.3,187 కోట్లు, సీత‌మ్మ సాగ‌ర్‌పై రూ.1,835 కోట్లు మరియు గౌర‌వెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన విషయాన్ని ఆధారాలతో తెలియజేశారు. కేంద్ర పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం వల్ల పనులు నిలిచిపోయి, ప్రాజెక్టుల అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, డాక్టర్ కడియం కావ్యతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Aug 2026 | 05:56 PM IST
Tags: