హైదరాబాద్: ఉత్తర తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన 'జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్' ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఈ వ్యూహాత్మక ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు.

2,009 ఎకరాల భూసేకరణ.. ఐఏఎఫ్, సివిల్ ఏవియేషన్‌కు కేటాయింపులు

ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో 1,609.23 ఎకరాలను భారత వైమానిక దళం (IAF) రక్షణ అవసరాల కోసం, మిగిలిన 400 ఎకరాలను సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్ఓ (MRO), కార్గో టెర్మినల్, హ్యాంగర్లు మరియు భవిష్యత్ విస్తరణల కోసం కేటాయించనున్నారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్లు, వాగులు, మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ల తరలింపు పనుల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు.

పరిశ్రమలు, పర్యాటక రంగానికి ఊతం.. డిసెంబర్ 31 నాటికి గడువు

భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ప్రయోజనం చేకూరడంతో పాటు వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భూసేకరణ మరియు మౌలిక వసతుల మార్పిడి పనులన్నింటినీ 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Jul 2026 | 10:10 PM IST
Tags: