దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం దిశగా సమాజంలో సేవ చేయాలనే జాతీయ భావంతో, దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడానికి కొందరు యువకులు నాడు నడుం బిగించారు. తాము చదువుతున్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కేంద్రంగా చేసుకొని వారు ప్రారంభించిన పనులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు 1949 జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పాటైంది. ఆ చారిత్రాత్మక రోజునే దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. విద్యార్థుల ద్వారా దేశం, సమాజం కోసం ఏర్పడిన ఈ విద్యార్థి పరిషత్ నేడు విజయవంతంగా 78వ వసంతంలోకి అడుగుపెడుతోంది.

విద్యారంగ సమస్యలపై నిరంతర గళం

స్థాపించినప్పటి నుంచి నేటి వరకు "విద్యారంగం ఒక కుటుంబం" అనే ఉన్నతమైన భావనతో ఏబీవీపీ పనిచేస్తోంది. కళాశాలల్లో చిన్న సమస్యలు మొదలుకొని మౌలిక వసతులు, ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్స్), సంక్షేమ వసతి గృహాల (హాస్టల్స్) సమస్యల వరకు ఎన్నో అంశాలపై నిరంతరం గళమెత్తుతూ పరిష్కారం కోసం పోరాడుతోంది. దీనితో పాటు "జాతీయత మా ఊపిరి - దేశభక్తి మా ప్రాణం" అంటూ దేశంలో ఎక్కడ విచ్ఛిన్నకర సంఘటనలు జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్ డాగ్‌లా ఏబీవీపీ నిమగ్నమై ఉంటుంది.

కొద్దిమందితో ప్రారంభమై, అనేక ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ దశాబ్దాలుగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది. పేద విద్యార్థులకు ఉచిత బోధన తరగతులు, మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో కార్యకర్తలు నిరంతరం ముందుంటున్నారు.

దేశం కోసం ఏబీవీపీ కార్యకర్తల బలిదానం

క్యాంపస్‌లలో పనిచేస్తున్న సందర్భంలో విదేశీ సిద్ధాంతాలతో ఉన్న కొన్ని శక్తులు దేశ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన రోజులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 1982వ సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను దించి నల్లజెండా ఎగరవేయడానికి ప్రయత్నించగా.. జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అప్పటి యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సామ జగన్మోహన్ ఆ శక్తులను ధీటుగా ఎదిరించారు. జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేసినందుకు ఆయనను అంతమందించారు.

ఇదే మాదిరిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మేరేటి చంద్రారెడ్డి, పరకాలలో దగ్గు వెంకన్న, భీమన్న, జగిత్యాలలో రామన్న, గోపన్న, జమ్మికుంటలో సమ్మిరెడ్డి, నల్లగొండలో ఏచూరి శ్రీను లాంటి 30 మందికి పైగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరంతా నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు.

శ్రీనగర్ నుంచి చలో చికెన్ నెక్ వరకు..

1990లో శ్రీనగర్ త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంపై ఏబీవీపీ తీవ్రంగా స్పందించి "ఎవరైతే జాతీయ జెండాను అవమానించారో వారే జాతీయ జెండాను గౌరవించాలి" అనే నినాదాన్ని ఇచ్చింది. అలాగే చొరబాటుదారులకు వ్యతిరేకంగా 1983 నుంచి ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంత వాస్తవ పరిస్థితులపై 2007లో ఏబీవీపీ ఒక ప్రత్యేక సర్వే చేయించింది. వోట్ బ్యాంక్ రాజకీయాల వల్ల సరిహద్దుల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న తీవ్రతను దేశం ముందు ఉంచింది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ 2008 డిసెంబర్ 17న బీహార్ సరిహద్దుల్లోని 'చికెన్ నెక్' దగ్గర 40 వేల మంది విద్యార్థులతో ఏబీవీపీ భారీ ఆందోళన చేపట్టి దేశ సమస్యల పట్ల యువతకు అవగాహన కల్పించింది.

వివిధ విభాగాలతో నైపుణ్యాల వెలికితీత

అన్ని వర్గాల విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు ఏబీవీపీ భిన్నమైన విభాగాలను ఏర్పాటు చేసింది.

  • SFD (స్టూడెంట్స్ ఫర్ డెవలప్‌మెంట్): 'జల్, జమీన్, జంగల్' అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది.

  • సృజన, నైపుణ్య ప్రబోధన్: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోంది.

  • రాష్ట్రీయ కళా మంచ్: విద్యార్థులలో ఉన్న కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహిస్తోంది.

  • మెడిసిన్ & వనవాసి: మెడికల్ విద్యార్థులకు, గిరిజన ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

విశ్వవిద్యాలయాలలో కొన్ని విద్యార్థి సంఘాలు, శక్తులు దేశ వ్యతిరేక ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంటే.. ఏబీవీపీ మాత్రం శాంతియుత రీతిలో స్వామి వివేకానంద, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, తద్వారా దేశ వైభవ సాధన కోసం కృషి చేస్తోంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుల రాజకీయాల పేరుతో వస్తున్న శక్తులను తిప్పికొట్టడానికి నేటి యువత సన్నద్ధం కావాలి.

నేటి విద్యార్థులు సమాజాన్ని చదివి, నూతన ఆవిష్కరణలు అందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. గడిచిన 78 సంవత్సరాలలో ఈ భిన్న వ్యవస్థలలో ఏబీవీపీ కార్యకర్తలు సమాజంలో మంచి మార్పు కోసం సానుకూల దృక్పథంతో కృషి చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, నిరంతరం ఉత్తమ పౌరులను తయారుచేసి దేశానికి అందించే ఒక ‘మ్యాన్ మేకింగ్ మిషన్’ కర్మాగారమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.

- కోలు గంగా చరణ్ (ఏబీవీపీ స్టేట్ లా స్టూడెంట్స్ ఫోరమ్ కన్వీనర్)

Updated: 10 Jul 2026 | 12:46 PM IST