ఫిల్మ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం 'పెద్ది' థియేటర్లలో సంచలన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఓటీటీ (OTT) విడుదలకు పక్కా లైన్ క్లియర్ చేసుకుంది.
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'
రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 9 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం జూలై 9 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఐదు వారాల ఓటీటీ విండో నిబంధనల ప్రకారం దక్షిణాది వెర్షన్లను విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్ మాత్రం థియేటర్ల నిబంధనల గడువు పూర్తి చేసుకుని ఆగస్టు నెలలో అందుబాటులోకి రానుంది.
రూ.400 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించింది. విదేశీ మార్కెట్లలో అంచనాల కంటే కాస్త తక్కువగా రాణించినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా ₹400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో చూడలేకపోయిన మెగా అభిమానులు, ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ యాక్షన్ డ్రామాను వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read latest Entertainment News and Telugu News
Updated: 10 Jul 2026 | 12:46 PM IST

