మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని మహేశ్వరం మండల పరిధిలోని మాన్షన్పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏర్పుల శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలికి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏర్పుల శ్రీశైలం మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఎంపిక కావడం జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆమె నాయకత్వం ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు. యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పార్టీ విధివిధానాలను పక్కాగా అమలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్వర్ణయుగం వస్తుందని శ్రీశైలం ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆమె తీసుకునే ప్రతీ కార్యక్రమానికి గ్రామస్థాయి కాంగ్రెస్ శ్రేణులు సంపూర్ణంగా సహకరిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నతుప్ర సర్పంచ్ రాజు గొల్లురి, ఏర్పుల యాదయ్య, ఏర్పుల రాజు, ఏర్పుల జంగయ్య, స్వర్ణగంటి ఆకాష్, ఎద్దు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.


