హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలని, ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఎలాంటి చర్చకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కలిసి ఒక నాటకం ఆడారని ఆరోపించారు. ప్రజలను పీడించిన నిజాం తరహాలోనే ఈ ఇద్దరు నాయకులు రాష్ట్రంలో పాలిస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా అసెంబ్లీలో నిజాంను పొగుడుతూ కేసీఆర్, రేవంత్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. కుర్చీలలో కూర్చున్న వ్యక్తులు మారారే తప్ప, నిజాంను కీర్తించడంలో మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. ఇద్దరూ ఎంఐఎం బానిసలుగానే మాట్లాడుతున్నారని, పాతబస్తీకి వెళ్లి ఎంఐఎంను పొగడటమే వారిపనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఆదివాసీ బిడ్డలను మర్రి చెట్టుకు కట్టేసి ఉరితీసిన నిజాంను మరియు బైరాన్పల్లిలో మగ దిక్కు లేకుండా కాల్చి చంపిన నిజాంను గొప్పవాడని ఎలా కీర్తిస్తారని ప్రశ్నించారు. శాసనసభలో నిజాంను పొగడటానికి ఆ ఇద్దరికీ సిగ్గు లేదా అని నిలదీశారు. నిజాం గొప్పవాడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన 'ఆపరేషన్ పోలో' తప్పా అని ప్రశ్నించిన ఆయన.. దాశరథి, కొమురం భీమ్, రాంజీ గోండు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహానీయుల పోరాటాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న నయా నిజాంలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కమ్యూనిస్ట్ పార్టీలపై, అధికార దుర్వినియోగంపై విమర్శలు
ఒకప్పుడు కేసీఆర్ వెనుక, నేడు కాంగ్రెస్ వెనుక నడుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీల తీరును ఎండగట్టిన రఘునందన్ రావు.. ఎవరు ఎవరి బూట్లు నాకుతున్నారో ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీలో 'నీవు కొట్టినట్లు చేయి.. నేను ఏడ్చినట్లు చేస్తా' అన్నట్లుగా ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. భూముల రికార్డులన్నీ ప్రభుత్వాల దగ్గరే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయికి వెళ్లడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్ ప్రూఫ్ బస్సులలో తిరగడం ఎందుకని, ఇదంతా కేవలం అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదని ఆరోపించారు. దానం నాగేందర్ విషయానికి వస్తే ఉపఎన్నిక ఎవరికీ అచ్చివచ్చిన దాఖలాలు లేవని, ఖైరతాబాద్ ఉపఎన్నికలో మాత్రం బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.


