బాలాపూర్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణనాథుడిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా బాలాపూర్ మండపానికి విచ్చేసిన ఆయన.. లంబోదరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. చారిత్రాత్మక బాలాపూర్ గణేష్ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యారు.


