హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని, డిజైన్లలో వైవిధ్యం తీసుకువచ్చేలా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేస్తున్న యూనిఫాంలు, ఇతర సామగ్రిపై సీఎం గారు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు ఇప్పటికే ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను ఈ నెలాఖరులోగా విద్యార్థులందరికీ అందజేస్తామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. అలాగే కేజీబీవీ (KGBV), మోడల్ స్కూల్ విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాల పంపిణీ కూడా పూర్తిగా పూర్తయిందని అధికారులు వివరించారు.

ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ భోజన సామాగ్రి, వసతికి సంబంధించిన ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు తదితర వస్తువుల పంపిణీ విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది విద్యార్థులకు అందించిన యూనిఫాంలు, ఇతర సామగ్రి నాణ్యత పట్ల తల్లిదండ్రుల నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తమైందని సీఎంకు వివరించారు.

వచ్చే విద్యా సంవత్సరానికి ముందే కార్యాచరణ

వచ్చే ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, ఇతర సామగ్రి విద్యార్థులందరికీ అందేలా ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత విద్యార్థుల సంఖ్యతో పాటు అదనంగా మరో 10 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శ్రీ పి. సుదర్శన్ రెడ్డి గారు, ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 19 Sept 2026 | 11:15 PM IST
Tags: