షాద్‌నగర్: షాద్‌నగర్ ప్రాంతంలో సంచార జాతులకు చెందిన నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సత్సంకల్పంతో ప్రత్యేక ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇందుకోసం స్థానిక హాజిపల్లి గ్రామ పంచాయతీ ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ అధికారికంగా తీర్మానం చేయడం పట్ల స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ స్థానిక శాసనసభ్యులు శంకర్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సర్పంచ్ మరియు గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఈ పాఠశాల ఏర్పాటుకు ఏకగ్రీయంగా తీర్మానం చేయడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక పాఠశాల పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు మరియు ఇతర అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిగా అందుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ గారు ఇప్పటికే ఈ పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశారని, రాబోయే వారం పది రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. సమాజంలో విద్య ద్వారానే ప్రగతి, భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రత్యేక చొరవతో వెనుకబడిన నిరుపేద పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమార్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్, హెల్త్ మోటివేటర్ జక్కుల శ్రీనివాస్, ఆర్ఐ వెంకట్ రెడ్డి, వి. రామారావు, మందారం నరసింహులు, ట్రెజరర్ గోర్ల రాము, జంగయ్య, బాలస్వామి, బి. నర్సింలు, దర్శన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 04:29 PM IST
Tags: