హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పుట్టిందని, జలదృశ్యం సాక్షిగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని గుర్తుచేశారు. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే పరమావధిగా బతికిన ధీశాలి ఆయసనని, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన పేరును హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టి సముచితంగా గౌరవించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి హరీశ్ రావు సైతం ఘన నివాళులర్పించారు. ‘పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నాయకత్వమని తన ఆచరణతో చూపిన గొప్ప దార్శనికుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన జీవితమంతా ఒక నిరంతర పోరాటం’ అని హరీశ్ రావు కొనియాడారు. నాడు 1969 ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఆయన నిస్వార్థ త్యాగం, బడుగు బలహీన వర్గాలు, చేనేత కార్మికుల పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఎక్స్లో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.


