ఆమనగల్లు: ఆమనగల్లు ప్రాథమిక సహకార సంఘం (సింగల్ విండో) ఆధ్వర్యంలో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల పరిధిలోని గ్రామాల రైతన్నల కోసం స్వల్ప అద్దెకే మందుల పిచికారి డ్రోన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తెలిపారు. సోమవారం సింగల్ విండో కార్యాలయ ఆవరణలో పాలకవర్గంతో కలిసి నూతన డ్రోన్ను ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ.. వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోందని, రైతుల ఈ ఇబ్బందిని తొలగించేందుకే సింగల్ విండో ద్వారా రసాయన ఎరువులు, మందులను చల్లేందుకు డ్రోన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అత్యాధునిక డ్రోన్ ద్వారా కేవలం గంట వ్యవధిలోనే 2 నుంచి 3 ఎకరాల వరకు ఎరువులు, పురుగుల మందులను పిచికారి చేయవచ్చని తెలిపారు. రైతులు ఈ ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందాలని కోరారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సింగల్ విండో సేవలు..
సహకార సంఘం ద్వారా రైతులకు ఎరువులను సకాలంలో అందిస్తున్నామని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి సింగల్ విండో ఎల్లప్పుడూ అహర్నిశలూ కృషి చేస్తుందని వెంకటేష్ గుప్తా స్పష్టం చేశారు. అలాగే డీసీసీబీ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రైతన్నలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు అందిస్తున్నామని చెప్పారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, డైరెక్టర్లు ఎనుమల జంగమ్మ, దావ శ్రీపాల్, చేగురి వెంకటేష్, బైలి వెంకటయ్య, జోగు వీరయ్య, కౌన్సిలర్ ఎనుముల రమేష్, సీఈవో పద్మాకర్ రెడ్డి, సిబ్బంది దేవేందర్, అల్లాజీ, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


