న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ చర్చల్లో పీటముడి పడినట్టే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒకరకంగా చర్చలు స్తంభించినట్టు కనిపిస్తున్నాయంటూ ఆమె ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ ముందుకు సాగే దిశగా ఇరు వర్గాలు అవతలి వారికి రాయితీలు ఇవ్వడం, రాజీ పడటం చాలా కష్టంగా మారిందని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యూనిక్ లీడర్స్ మీటింగ్లో మంత్రి ఈ కామెంట్స్ చేశారు.
ఇరు వర్గాలు ఎంతోకొంత రాజీ ధోరణి ప్రదర్శిస్తాయా? లేదా? అన్న దానిపైనే చర్చల్లో పురోగతి ఆధారపడి ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ డీల్ కోసం అవతలివారికి ఇచ్చే మినహాయింపుల విషయంలో ఇరు వర్గాలకు కష్టంగా కనిపిస్తోంది’ అని ఆమె వెల్లడించారు.
సుంకాలు కాదు.. చర్చలే పరిష్కారం..
అమెరికాతో వాణిజ్యం ఇప్పటికీ భారత్కే అనుకూలంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల తమకు నష్టం జరుగుతోందని భావిస్తున్న అమెరికా, వాణిజ్య లోటును కొంతవరకైనా పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. డీల్స్పై దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో మార్పులు వస్తున్నాయని, సుంకాలు కూడా ఈ చర్చల్లో భాగంగానే ఉన్నప్పటికీ అవి కొత్త పథంలో వెళుతున్నాయని అన్నారు. ఏదేమైనప్పటికీ దేశాలకు ఇప్పటికీ చర్చలే సరైన మార్గమని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని దేశాలు వెతకాలని సూచించారు.
ప్రస్తుతం వివిధ దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని, ఇలాంటి ఒప్పందాలే మరింత ప్రయోజనకరమని పలు దేశాలు భావిస్తున్నట్టు చెప్పారు. బహుపాక్షిక ఒప్పందాల కంటే ద్వైపాక్షిక ఒప్పందాలపైనే ప్రస్తుతం ఎక్కువ ఆసక్తి వ్యక్తమవుతోందని పేర్కొన్న మంత్రి.. భారత్-ఈయూ మధ్య కుదిరే ఒప్పందాన్ని కూడా తాను ద్వైపాక్షిక ఒప్పందంగానే పరిగణిస్తానని స్పష్టం చేశారు.


