కడ్తాల్: నేటి ఆధునిక సాంకేతిక అభివృద్ధి సమయంలో సెల్ ఫోన్ల వాడకం పెరిగి పుస్తక పఠనం చాలా వరకు తగ్గిపోయిందని, కాబట్టి విద్యార్థులలో మళ్లీ పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించాలని లయన్ డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ క్లబ్ కమ్యూనిటీ గ్రాంట్స్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రంథాలయాలకు సహకరించే ప్రాజెక్ట్‌లో భాగంగా.. కడ్తాల్ మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో గ్రంథాలయం కోసం దాదాపు 300 పుస్తకాలను సమకూర్చడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిన తక్షణ మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి అంశం సెల్ ఫోన్‌లోనే లభ్యమవడంతో పుస్తకాలపై ఆధారపడే గుణం తగ్గిపోయిందని తెలిపారు. హైస్కూల్ పిల్లల్లో మరుసటవుతున్న తెలుగు భాషాభిమానాన్ని, పుస్తక పఠనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టామని చెప్పారు. ప్రతి గ్రంథాలయం ఒక విజ్ఞాన సర్వస్వమని, అలాంటి గ్రంథాలయం ప్రతి హైస్కూల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పుస్తకాలను అందజేసినట్లు వివరించారు.

ట్రీ ప్లాంటేషన్..

ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్క విద్యార్థికి స్పృహ ఉండాలని, మొక్కలు నాటడంతో సరిపోకుండా ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా సంరక్షించినప్పుడే ఆ పనులకు సార్థకత ఉంటుందని పెద్దలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గవర్నర్ జి. చెన్న కిషన్ రెడ్డి, మాజీ క్యాబినెట్ కార్యదర్శి తాళ్ల అంజయ్య, జోన్ చైర్మన్ భీమ్ రెడ్డి రాంరెడ్డి, క్లబ్ మాజీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, హైస్కూల్ హెడ్మాస్టర్ జంగయ్య, ఉపాధ్యాయులు, క్లబ్ సభ్యులు చెన్న కిషన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, కుమార్, బిచ్యా నాయక్, రాజు, క్లబ్ పీఆర్వో పాషా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Oct 2026 | 08:14 PM IST
Tags: