షాద్‌నగర్: నియోజకవర్గ నలుమూలలా మౌలిక వసతుల కల్పన, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మొత్తం రూ. 11.30 కోట్లు మంజూరైనట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ నిధుల కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెల్యే మీడియాకు వివరించారు.

ఈ మంజూరైన నిధుల ద్వారా ఫరూఖ్‌నగర్ మండలంతో పాటు కొత్తూరు, నందిగామ, జిల్లేడు చౌదరిగుడ, కొందుర్గు, కేశంపేట తదితర అన్ని మండలాల్లోనూ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శంకర్ వెల్లడించారు. హెచ్ఎండీఏ ద్వారా రూ. 10 కోట్లు మంజూరు కాగా.. దీనితో నియోజకవర్గంలో మొత్తం 97 అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఒక్కో పనికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కేటాయించి పనులను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు.

అదేవిధంగా జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ ద్వారా మరో రూ. 30 లక్షలు మంజూరు కాగా, వాటితో 6 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. మరోవైపు డీఎంఎఫ్‌టీ (DMFT) నిధుల కింద కోటి రూపాయలు మంజూరయ్యాయని, నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రజల సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ఈ నిధులను ప్రాధాన్య క్రమంలో ఉపయోగిస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని పనులకు సంబంధించిన అంచనాలు (ఎస్టిమేషన్స్) పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న లేదా భవనాలు లేని పంచాయతీలకు సొంత భవనాలను సమకూర్చినట్లు గుర్తుచేశారు. అదేవిధంగా నందిగామ, జిల్లేడు చౌదరిగుడ మండలాలకు నూతనంగా ఎమ్మార్వో కార్యాలయ భవనాలను కూడా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీల్లో నెలకొన్న ప్రతి చిన్న సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Sept 2026 | 01:57 PM IST
Tags: