ప్రస్తుతం వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనలు రైతన్నలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, 20:20 వంటి అన్ని రకాల ఎరువులను ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని, ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలన్న నిబంధన పెట్టడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, ఒకవేళ ఉన్నా యాప్‌లను ఎలా వాడాలో అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. చేసేది లేక రైతులు తమ బంధువులు, చుట్టుపక్కల వారిని ఆశ్రయించి ఎరువులు బుక్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రభుత్వం అందించే ఎరువులు పొందాలంటే రైతులు ముందుగా స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు పట్టాదారు పాసుపుస్తకం వివరాలను జోడించి, యాప్‌లో సుమారు 20 నుంచి 30 నిమిషాలు కష్టపడితేనే బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, చదువురాని సామాన్య రైతులకు తలకు మించిన భారంగా మారింది. కొత్తూర్ గ్రామానికి చెందిన రైతు పెండ్యాల భీమయ్య మాట్లాడుతూ.. "నాకు చదువు రాదు, సెల్‌ఫోన్ వాడుడు రాదు. నాకున్న పొలంలో నేను కష్టపడి సాగు చేసుకుంటున్నా. ఇప్పుడు యూరియా కావాలంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటున్నారు. యూరియా దొరకకుంటే వ్యవసాయం ఎలా ముందుకు సాగుతుంది? మాలాంటి వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మునుపటిలా నేరుగా దుకాణాలకు వెళ్లే ఎరువులు దొరికేలా చూసి ఆదుకోవాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఆన్‌లైన్‌లో ఎక్కడికో దూర ప్రాంతాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో స్టాక్ ఉన్నట్లు మెసేజ్ రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, ఇతర వాహనాలను కిరాయికి కుదుర్చుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రైతులకు ఎరువుల ధరలతో పాటు అదనంగా రవాణా భారం పడుతుండటంతో పాటు, రోజంతా సమయం వృథా అవుతోందని రైతన్నలు వాపోతున్నారు. సామాన్య, పేద రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువుల కొనుగోలు విధానాన్ని సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Sept 2026 | 12:32 PM IST
Tags: