హైదరాబాద్: సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ చేపట్టిన వెంచర్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ సమన్లు జూరీ జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆ నోటీసులో ఈడీ స్పష్టం చేసింది. ప్రధానంగా రూ. 2.1 కోట్ల లావాదేవీలకు సంబంధించి అరికెపూడి గాంధీని అధికారులు విచారించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఫ్రీ లాంచ్ పేరుతో అమాయక కొనుగోలుదారుల నుంచి భారీగా నగదు వసూలు చేసి, ఆ నిధులను కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించారనే తీవ్ర ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. సాహితీ ఇన్‌ఫ్రా మోసాలకు సంబంధించి గతంలోనే ఈడీ రంగంలోకి దిగి సుమారు రూ. 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో విడతలో మరో రూ. 12.6 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 56 బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను 2024లోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి నోటీసులు రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Sept 2026 | 12:39 PM IST
Tags: