షాద్‌నగర్: అఖిల భారత ఆర్పీఎఫ్ (RPF) రైజింగ్ డే వేడుకలను పురస్కరించుకుని షాద్‌నగర్‌లో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో పలు సేవా మరియు సామాజిక అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ / ఆర్పీఎఫ్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ / ఆర్పీఎఫ్ అబ్దుల్ ఖమర్‌తో పాటు కానిస్టేబుళ్లు జయవీర్, రాంపూజన్ సింగ్, మహిళా కానిస్టేబుల్ సునీత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా తొలుత ఆర్పీఎఫ్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సిబ్బంది అందరూ కలిసి యోగా కార్యక్రమం నిర్వహించి, నిత్య జీవితంలో ఆరోగ్య పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ప్రయాణికులకు భద్రతా సూచనలు

రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ప్రయాణ సమయాల్లో ప్రయాణికులు తమ విలువైన వస్తువులను, లగేజీని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలని కోరారు. దొంగతనాలను నివారించేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు ఏవైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తమై ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ప్రయాణ వేళల్లో ఏకైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా, లేదా తక్షణ సహాయం కావాల్సి వచ్చినా వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ '139'కు సంప్రదించాలని ప్రయాణికులకు వివరించారు.

inline-img

షెల్టర్ హోమ్‌లో పండ్లు పంపిణీ

ఈ కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్‌లోని 'షెల్టర్ ఫర్ అర్బన్ హోమిలీస్' (Shelter for Urban Homely's)ను ఆర్పీఎఫ్ సిబ్బంది సందర్శించారు. అక్కడ నివసిస్తున్నవారితో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. ఆర్పీఎఫ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా వారికి పండ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విధంగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవాభావం, భద్రత, పరిశుభ్రతపై చక్కటి అవగాహన కల్పిస్తూ ఈ వేడుకలను ప్రశాంతంగా, విజయవంతంగా ముగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 20 Sept 2026 | 07:25 PM IST
Tags: