కేశంపేట: రంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా ఆయిల్ పామ్ పంట కోత మహోత్సవ కార్యక్రమం కేశంపేట మండలం అల్వాల్ గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. గ్రామానికి చెందిన రైతు భుజంగరెడ్డి గారి ఆయిల్ పామ్ తోటలో మొదటి పంట కోతను షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పీఏసీఎస్ (PACS) చైర్మన్లు, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు, వాల్యూ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పురోగతి

ఈ సందర్భంగా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,57,000 ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉందని, సరైన కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రధానంగా 57,637 బోర్లు, 5,600 బావుల కిందనే సాగు జరుగుతోందని తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు క్రక్రమేణా పెరుగుతోందని వెల్లడించారు:

ఆయిల్ పామ్ (తైల తాటి) అనేది 30 నుండి 40 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే పంటని, ఇది సాధారణంగా 4వ సంవత్సరం నుండి దిగుబడినివ్వడం ప్రారంభించి ఎకరానికి 4 టన్నుల వరకు, అలాగే 10వ సంవత్సరానికి ఏకంగా 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా నూనె దిగుబడినిచ్చే పంట ఇదేనని, వరి సాగు లాగా తీవ్రమైన నీటి ఎద్దడి, కూలీల కొరత సమస్యలు ఇందులో ఉండవని పేర్కొన్నారు. చదరపు పద్ధతిలో ఎకరానికి 50 మొక్కలు, త్రికోణ పద్ధతిలో 57 మొక్కలు నాటుకోవచ్చని, కొందుర్గు నర్సరీలో దిగుమతి విత్తనాలను 12 నెలలు (4 నెలలు ప్రైమరీ, 8 నెలలు సెకండరీ దశల్లో) పెంచి పటిష్టంగా రైతులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఆహార భద్రతకు ఆయిల్

దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో, దేశ పౌరుల ఆహార భద్రతకు రైతులు అంతకంటే ఎక్కువగా అవసరమని వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మనకు కావలసిన నూనె అవసరాల్లో కేవలం 15-20% మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతుండగా, దాదాపు 80% మేర విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సాగును ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని, ఇది చట్టబద్ధమైన భద్రత మరియు స్థిరమైన మార్కెట్ వసతి ఉన్న అద్భుతమైన పంటని స్పష్టం చేశారు.

inline-img

ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి యాస్మిన్ బాషా, జిల్లా ఉద్యానవన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి సురేష్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుజాత, కేశంపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO), షాద్‌నగర్ ఉద్యానవన శాఖాధికారి హిమ బిందు, ఉద్యానవన విస్తరణ అధికారులు రుక్మిణి, రాజేష్, వ్యవసాయ అధికారులు రాంచందర్రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ క్షేత్రాధికారులు (ఫీల్డ్ ఆఫీసర్లు) పాల్గొన్నారు.

అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, ఫరూఖ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) శ్రీకాంత్ రెడ్డి, కేశంపేట పీఏసీఎస్ శ్రీధర్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, అల్వాల్ గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు  పాల్గొని విజయవంతం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Sept 2026 | 10:27 PM IST
Tags: