హయత్ నగర్: హయత్ నగర్ మండల కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగుల (వికలాంగుల) సంక్షేమం కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను కేవలం వారి అవసరాలకే పూర్తిగా వినియోగించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ ఎంపీడీవో శ్రీ వాణిని వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అందే రాంబాబు మాట్లాడుతూ.. 2013లో బీఎంపీఆర్వై (BMPRY) నిధులతో వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ భవనాన్ని ప్రస్తుతం 108 సిబ్బంది వినియోగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల స్థానిక వికలాంగుల సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, తమ సమస్యలపై చర్చించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇతర ప్రైవేట్ హాళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కమ్యూనిటీ హాల్‌ను వెంటనే వికలాంగుల అవసరాలకు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తేజావత్ కొమురయ్య నాయక్, బి. రామచంద్రయ్య, గొల్ల పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 06:44 PM IST
Tags: