షాద్నగర్: సంపాదించడం మాత్రమే గొప్ప కాదు.. సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి సేవ చేయడం నిజమైన గొప్పతనమని నిరూపిస్తున్నారు షాద్నగర్కు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త, ఎంఎస్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ అధినేత మహమ్మద్ షకీల్. షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ చొరవతో సిండికేట్ కాలనీలో నిరుపేద చిన్నారుల చదువు కోసం చేపట్టిన నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఆయన రూ. 5 లక్షల భారీ విరాళాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.
తొలుత ఈ సత్కార్యం కోసం రూ. లక్ష విరాళం ఇవ్వాలని భావించినప్పటికీ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన ఆయన, తన విరాళాన్ని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచి అందించారు. నిరుపేద పిల్లలకు అక్షర విద్యను అందించి వారి భవిష్యత్తులో వెలుగులు నింపాలనే ఈ సత్సంకల్పానికి అండగా నిలిచిన మహమ్మద్ షకీల్ ఉదారతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
మహమ్మద్ షకీల్ సమాజసేవలో ముందుండడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల సమయంలోనూ ఆయన తన విశేష సేవా గుణాన్ని చాటుకున్నారు. కోవిడ్ బారినపడి ఇబ్బందులు పడిన కుటుంబాలకు నేరుగా ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు సైతం స్వయంగా ముందుకు వచ్చి సహకరించారు. ఎలాంటి కుల, మత భేదాలు లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటూ షాద్నగర్ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
పేద విద్యార్థుల చదువు కోసం పాఠశాల భవన నిర్మాణానికి ఉదారంగా ముందుకు వచ్చి భారీ విరాళం అందించిన మహమ్మద్ షకీల్ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేకంగా అభినందించారు. సమాజం పట్ల బాధ్యతగా మెలుగుతూ ఆయన చూపుతున్న సేవా దృక్పథం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు.


