షాద్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవల శివుడు–శ్రీరాముడి విషయంలో, అలాగే ద్రావిడులు–ఆర్యుల అంశంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ మంగళవారం షాద్‌‌నగర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తూ పెద్దపెట్టున నిరసన వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 28న ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శివుడు పేదల దేవుడని, రాముడు ధనికుల దేవుడని, అలాగే దక్షిణాది వారు ద్రావిడులు, ఉత్తరాది వారు ఆర్యులని వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థలు నివేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు.

inline-img

ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అందె బాబన్న మాట్లాడుతూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ సమాజాన్ని, కోట్ల మంది ప్రజలు కొలిచే ఆరాధ్య దైవాలను వర్గాల వారీగా విభజించి మాట్లాడటం అత్యంత సమంజసం కాదన్నారు. శివుడు పేదల దేవుడు, శ్రీరాముడు ధనికుల దేవుడు అంటూ దేవుళ్ల మధ్య కుల, వర్గ భేదాలు ఆపాదించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.

ద్రావిడులు–ఆర్యులు, దక్షిణాది–ఉత్తరాది అంటూ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను, భేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సామాజిక సామరస్యానికి పూర్తిగా విరుద్ధమని బాబన్న అన్నారు. శ్రీరాముడు, పరమశివుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల పరమ పవిత్ర ఆరాధ్య దైవాలని, అలాంటి దేవుళ్లను రాజకీయ వివాదాల్లోకి లాగడం తగదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి స్థాయిలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించాలని అందె బాబన్న డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వెంటనే తన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రజలకు బేషరతుగా వివరణ ఇవ్వాలని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ మోహన్‌సింగ్ నాయక్, పిట్టల సురేష్, చిట్టెం లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్ చారి, మురళి, సిరిపురం వెంకటరమణ, గడ్డం కుమార్, కాసోజు శివకుమార్, పుట్నాల సాయికుమార్, బీజేవైఎం ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు మలిపెద్ది వివేక్ గుప్తా, జంబుల నరసింహులు, ఉదయ్‌కుమార్, మహేందర్‌రెడ్డి, గజ్జల ప్రవీణ్‌కుమార్, రమణ, సాయికుమార్, సుధాకర్ అప్ప, గట్టు శివ, సాయిరాం, కాసోజు శివ, రిషికేష్, రాకేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 29 Sept 2026 | 11:15 PM IST
Tags: