షాద్‌నగర్: షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పేద విద్యార్థుల విద్య కోసం మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్పటికే దాతల సహకారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్న ఆయన.. తాజాగా సంచార జాతుల పేద పిల్లల కోసం పాఠశాల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సిండికేట్ కాలనీలో సంచార జాతుల పిల్లల కోసం ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “పేద పిల్లలు మాకు చదువుకోవడానికి బడి కావాలని అడిగినప్పుడు నేను ఎంతో చలించిపోయాను. వారికి చదువుకునే అవకాశం కల్పించడం మనందరి సామాజిక బాధ్యత. అందుకే వెంటనే స్పందించి పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాం” అని ఆయన భావోద్వేగంతో తెలిపారు. పేద విద్యార్థుల చదువుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, విద్యా రంగానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద పిల్లల విద్యకు అండగా నిలవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.
మీడియా ప్రతినిధులు కూడా పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలని, ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్‌లు అందజేయాలని స్థానిక మీడియా సీనియర్ ప్రతినిధి లట్టుపల్లి మోహన్ రెడ్డి ద్వారా కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, గ్రామ సర్పంచ్ కుమార్, మండల విద్యాధికారి మనోహర్, కౌన్సిలర్ సి. పెంటయ్య, కొప్పునూరి ప్రవీణ్ కుమార్, దిలీప్, చందులాల్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు, గిరిజన ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఫరూఖ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, చందు నాయక్, సిద్ధార్థ, కరుణాకర్, నక్క బాలరాజు, మాధవులు యాదవ్, మనీష్, నీరటి వాసు, మంగ అశోక్, గంగమోని సత్తయ్య, సీతారాములు, మహేందర్, విష్ణు, సుదర్శన్, రాము, వెంకటేష్‌తో పాటు పలువురు అధికారులు, దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


