మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షా సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో మండల పరిధిలోని 33 గ్రామాలకు చెందిన సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ తమ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో తాగునీరు, అండర్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలతో పాటు యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి, అక్రమ మద్యం విక్రయాలపై సర్పంచ్లు ప్రధానంగా చర్చించి అధికారులను నిలదీశారు.
గంజాయి, అక్రమ మద్యం విక్రయాలపై సర్వత్ర ఆందోళన
సమావేశంలో కె.సి. తండా సర్పంచ్ సుజాత మోతిలాల్ మాట్లాడుతూ.. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అండర్ డ్రైనేజీ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా విప్రో కంపెనీ ఎదురుగా ఉన్న కొన్ని కిరాణా షాపుల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉందని సమావేశం దృష్టికి తెచ్చారు. అలాంటి షాపులపై ఎస్ఓటీ (SOT) పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గంజాయి విక్రయాలు నిజమని తేలితే షాప్ యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై స్పందించిన పలు గ్రామాల సర్పంచ్లు కూడా తమ గ్రామాల్లో కిరాణా షాపుల ముసుగులో అక్రమంగా మద్యం, గంజాయి విక్రయాలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.
అభివృద్ధి పనులు, ఐసీడీఎస్ కేంద్రం తరలింపుపై ఆగ్రహం
అలాగే పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు, అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజీ పనులపై చర్చించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మహిళా సంఘాల పనితీరును బలోపేతం చేయాలని, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన పీహెచ్సీ (PHC) కేంద్రాలను పునరుద్ధరించాలని, అసైన్డ్ భూముల నుంచి రాత్రి సమయాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, మహేశ్వరంలో ఉన్న ఐసీడీఎస్ (ICDS) సెంటర్ను మరో ప్రాంతానికి తరలించడంపై స్థానిక సర్పంచ్ మునగపాటి నవీన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఐసీడీఎస్ సెంటర్ను తిరిగి మహేశ్వరంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమంగా ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ పీడీ సుభాషిణి, ఎంపీడీవో శారదమ్మ, ఎంపీవో రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, సహకార సంఘం సొసైటీ ఛైర్మన్ మంచె పాండు యాదవ్, రెవెన్యూ అధికారి ఆర్ఐ రాజిరెడ్డి, ఎక్సైజ్ శాఖ సీఐ సీహెచ్. యాదయ్య, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


