షాద్‌నగర్: జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న దయనీయ పరిస్థితులలో.. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల పంటలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని, అసలైన రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థపై పడిన మచ్చ అని ఆయన ధ్వజమెత్తారు.

జూరాల ఆయకట్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర కీలక పంటలు సాగునీరు అందక తీవ్రంగా దెబ్బతింటున్నాయని, దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అడ్డుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం అక్రమ అరెస్టులతో రైతుల కష్టాలను, వారి గొంతును అణచివేయలేరని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలపై బీజేపీ మరింత బలంగా పోరాటాలు సాగిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని రైతులకు తక్షణమే న్యాయం జరిగే వరకు గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలలో ప్రజలను, రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూరాల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరపాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఇసునాతి శ్రీనివాస్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ సింగ్ నాయక్, బీజేవైఎం నాయకులు వంశీకృష్ణ, సుధాకర్ అప్ప, లష్కర్ నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, కృష్ణ యాదవ్, నారాయణరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Sept 2026 | 10:35 PM IST
Tags: