మహేశ్వరం: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మహేశ్వరం మండలం పెండ్యాల్ గ్రామంలో మంగళవారం “జల్ అర్పణ్ దివస్” కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నీటి ప్రాధాన్యత, జల సంరక్షణ, సురక్షిత తాగునీటి వినియోగంపై విశేష అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిషన్ భగీరథ ఏఈ రఘు మాట్లాడూతూ.. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఉదాత్త లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న “హర్ ఘర్ జల్” కార్యక్రమం విశిష్టతను ప్రజలకు వివరించారు. తాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకుండా, కేవలం అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి నీటి కొరత తలెత్తకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఒడిసిపట్టి భూగర్భ జలాలను గణనీయంగా పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం గ్రామంలోని నీటి ట్యాంకు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నీటి వనరుల పరిరక్షణ, పరిశుభ్రమైన తాగునీటి వినియోగంపై నినాదాలు చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రజలకు నీటిని పొదుపుగా వినియోగించడం, నీటి వృథాను పూర్తిగా అరికట్టడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ అనసూయ అంజయ్య, జీపీఓ రాజేందర్, విలేజ్ సెక్రటరీ కృష్ణయ్య, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 29 Sept 2026 | 11:00 PM IST
Tags: