మహేశ్వరం: మహేశ్వరం మండలం ఆకన్పల్లి, కల్వకోల్ గ్రామపంచాయతీల పరిధిలో మంగళవారం సామాజిక భద్రతా పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. మహేశ్వరం ఎంపీడీఓ ఎన్. శారదమ్మ ఆధ్వర్యంలో సంబంధిత పంచాయతీ అధికారులు నేరుగా గ్రాగాలకు చేరుకుని పెన్షన్ లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల అర్హత, వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డులు మరియు సంబంధిత ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులు సమర్పించిన వివరాలను ప్రభుత్వ అధికారిక రికార్డులతో సరిపోల్చుతూ ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ ఎలాంటి అంతరాయం లేకుండా సక్రమంగా అందుతున్నదా లేదా అనే అంశాలను కూడా అధికారులు ఆరా తీశారు.
వెరిఫికేషన్లో భాగంగా తనిఖీలకు అవసరమైన పత్రాలు మరియు సమగ్ర సమాచారాన్ని లబ్ధిదారుల నుంచి సేకరించి రిజిస్టర్లలో నమోదు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి రికార్డుల్లో నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్. శారదమ్మతో పాటు ఆకన్పల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ రాఘవేందర్, కారోబార్ శంకరయ్య, కల్వకోల్ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ, గ్రామ పెద్దలు బక్కని రవి మాదిగ, పంచాయతీ సెక్రటరీ వేణు, ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్, కొండని శేఖర్, బొజ్జం శ్రీనివాస్, గుర్రంపల్లి మహేందర్, అనిల్, కృష్ణ, వీరేష్, అలాగే పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


