రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూఘాట్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత, విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మరియు సరైన సమయంలో చిన్నపిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్లే తమ పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బాధితుల వివరాల ప్రకారం.. కాటేదాన్కు చెందిన శాలినికి సోమవారం స్థానికంగా ఉన్న పెర్ల్ (Pearl) ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. పుట్టిన మొదటి రోజు బాబు బాగానే ఉన్నప్పటికీ, రెండో రోజుకి వచ్చేసరికి తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడు (పెడియాట్రిషియన్) అందుబాటులో లేకపోవడంతో సరైన వైద్యం అందలేదు. సుమారు మూడు రోజులపాటు పరిస్థితిని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా కాలయాపన చేశారని తల్లిదండ్రులు శాలిని, అనిరుద్ గౌడ్ ఆరోపించారు. పరిస్థితి పూర్తిగా విషమించి శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. చివరి క్షణాల్లో మంగళవారం సాయంత్రం హుటాహుటిన అంకురా (Aankura) ఆసుపత్రికి రిఫర్ చేసి తరలించారు. అప్పటికే పసికందు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, అంకురా ఆసుపత్రికి చేరిన 12 గంటలకే శిశువు మృతి చెందాడు.
17 ఏళ్ల తర్వాత సంతానం.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కుటుంబంలో మగ సంతానం కలగడంతో ఎంతో సంతోషపడిన ఆ కుటుంబానికి, ఈ ఘటన తీవ్రమైన గుండెకోతను, విషాదాన్ని మిగిల్చింది. తమ బిడ్డ మృతికి పూర్తిగా పెర్ల్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఆసుపత్రిపై దాడి, ధ్వంసం
వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహించిన బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పెర్ల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై మండిపడుతూ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శిశువు మృతికి అసలు కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


