అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

లడ్డూను దక్కించుకునేందుకు కళాశాలకు చెందిన ఏవీహెచ్ (AVH), అస్రా (ASRA) గ్రూపుల విద్యార్థులు హోరాహోరీగా పోటీపడ్డారు. ఇరువర్గాల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ వేలంపాటలో చివరకు రికార్డు స్థాయిలో రూ. 1,20,000 (లక్షా ఇరవై వేల రూపాయలకు) ఏవీహెచ్ విద్యార్థులు లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడారు. విఘ్నేశుని దివ్య ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఉజ్వలమైన భవిష్యత్ లభించాలని, అన్ని రంగాల్లో రాణించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 23 Sept 2026 | 07:34 PM IST
Tags: