ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి బుధవారం ఆయన ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ వార్డు కార్యాలయం, కుర్షి కాలనీ, శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్‌లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్ ప్రక్రియను వారు స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఈవో సుదర్శన్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ.. 'నో మ్యాపింగ్' (No Mapping), 'అనామలీస్' (Anomalies) వంటి ప్రత్యేక కేటగిరీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా అనవసరంగా జాబితా నుంచి తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్ ఎంట్రీలు, చిరునామా మార్పులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. డోర్-టు-డోర్ వెరిఫికేషన్, పత్రాల పరిశీలన, డేటా ఎంట్రీ మరియు మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి దరఖాస్తు, అభ్యంతరం, నోటీసు మరియు ఫైల్ డిస్పోజల్ వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో ఓటర్లకు నోటీసులు జారీ చేసి వారి అభ్యంతరాలు, వివరణలను నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక లేదా క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు) సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 23 Sept 2026 | 07:41 PM IST
Tags: