మహేశ్వరం: మహేశ్వరం మండల పరిధిలోని చిన్నతుప్ర గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ రాజు గొల్లూరి అధికారికంగా ప్రారంభించారు. గ్రామంలోని పాత, దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మురుగునీరు రోడ్లపైకి చేరి కాలనీవాసులు తరచూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సర్పంచ్ స్వయంగా గుర్తించారు. ఈ సమస్యకు ఎలాంటి తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేలా సెంటర్ లైన్ అండర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని పక్కా ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాజు గొల్లూరి మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతోనే ఈ నూతన అండర్ డ్రైనేజీ పనులను శ్రీకారం చుట్టామన్నారు. పనులను నాణ్యతా ప్రమా్యాలతో, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని, కాంట్రాక్టర్లను గట్టిగా ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే కాలనీవాసులకు మురుగునీటి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుందని, గ్రామం పరిశుభ్రంగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాజశేఖర్, వార్డు సభ్యులు ఎం. శ్రీకాంత్, ఎస్. శ్రీకాంత్, డి. సంజీవ, డి. రమేష్, బి. రఘుపతి, కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ డి. రాజు, యువ నాయకులు హరికృష్ణ, రాఘవేందర్, త్రినాథ్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.


