షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం చటాన్ పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోళ్లకు వ్యాక్సిన్ వేయడానికి పిలిచి, తీరా ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు పని చేయమని చెప్పడంతో ఓ నిండు ప్రాణం బలయింది. కమదనం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి బుధవారం ఉదయం చటాన్ పల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు వ్యాక్సినేషన్ పనుల కోసం వెళ్లాడు.

అయితే అక్కడ విద్యుత్ సమస్య ఉండటంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద కొంచెం సరిచేయాలని వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న పర్యవేక్షకుడు నరసింహులు సూచించడంతో.. కృష్ణారెడ్డి ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ మరమ్మతు పనులు చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనుకోకుండా విద్యుత్ షాక్‌కు గురైన కృష్ణారెడ్డి సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు కృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సర్పంచ్ లతా కిరణ్ కుమార్ గౌడ్ ఆగ్రహం

కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకోక ముందే, ఎలాంటి పూర్తి స్థాయి విచారణ జరగకుండానే పోలీసులు, నిర్వాహకుల సహాయంతో హుటాహుటిన శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పట్ల గ్రామ సర్పంచ్ లతా కిరణ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించకుండా, కుటుంబ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకముందే శవాన్ని ఎలా తరలిస్తారని ఆమె ప్రశ్నించారు.

కృష్ణారెడ్డిని వ్యాక్సినేషన్ కోసం పిలిచి కరెంటు పనులు అప్పగించడంలో అసలు మతలబు ఏమిటని నిలదీశారు. అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నందుకు వ్యవసాయ క్షేత్ర యజమాని పూర్తి సమాధానం చెప్పాలని, కృష్ణారెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగకపోతే గ్రామస్తులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సర్పంచ్ లతా కిరణ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 23 Sept 2026 | 05:51 PM IST
Tags: