మహేశ్వరం: మహేశ్వరం మండలం చిన్నతుప్ర గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, పర్యావరణ హితంగా సాగుతున్నాయి. గ్రామంలోని యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ భక్తులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం గ్రామస్తుల కోలాహలం మధ్య ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు, స్థానికులు పోటీపడటంతో వేలం పాట ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఒకరిని మించి మరొకరు ఉత్సాహంగా వేలం పాడటంతో చివరకు మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, చిన్నతుప్ర గ్రామ సర్పంచ్ రాజు గొల్లురి రూ. 68,000ల అత్యధిక ధరకు లడ్డూను కైవసం చేసుకున్నారు. పవిత్రమైన గణనాథుని ప్రసాదంగా భావించే ఈ లడ్డూను దక్కించుకున్న సర్పంచ్ రాజు గొల్లురిని యువ భారత్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. వినాయకుడి ఆశీస్సులతో రాజు గొల్లురి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్గాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
గ్రామంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువ భారత్ సభ్యుల కృషిని పలువురు అభినందించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వేలం పాట ముగిసిన అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


