గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, బహుజన విప్లవ పతాక చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రజక సంఘం గ్రామ అధ్యక్షుడు మునిగంటి మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) ఇప్ప నరేందర్, ఎంపీడీవో, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో ఇప్ప నరేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ నేలలో దొరల, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తన భూమి హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన సాహసోపేత పోరాటం ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా చైతన్యానికి, హక్కుల సాధన పోరాటానికి ఐలమ్మ నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఆమె పోరాట పటిమను, త్యాగాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి ఇస్తున్న గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు మునిగంటి మల్లయ్య, ఉపాధ్యక్షులు సత్తయ్య, తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాములు, కోశాధికారి శ్రీధర్, కార్యదర్శి అజయ్, మండల అధ్యక్షుడు మునిగంటి నాగరాజు, కోశాధికారి కనకయ్య, ముఖ్య సలహాదారు మొండయ్య, పోచయ్య, బాలయ్య, స్థానిక నాయకులు బొడ్డు సునీల్, న్యాత సుధాకర్, గంప వెంకన్న, చింతల శ్రీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.


