రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్–నషా ముక్త్ భారత్ యువ భారత్ అభియాన్’లో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం నాగయ్యగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మాదకద్రవ్యాలకు సర్వదా దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) వైద్యులు డాక్టర్ బి. శ్యామ్ ప్రసాద్, డాక్టర్ ఎన్. స్రవంతి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నషా ముక్త్ భారత్ యువ భారత్ అభియాన్ ప్రధాన ఉద్దేశాలు, అలాగే మాదకద్రవ్యాల సేవించడం వల్ల కలిగే తీవ్ర అనర్థాలను వివరించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్‌కు అలవాటు పడకుండా చిన్ననాటి నుంచే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలని హితవు పలికారు.

ఇంటి ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని, బయట లభించే జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల దృక్పథంతో చదువులో ముందుకు సాగాలని తెలిపారు. చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భారత్ కుమార్, ద్రౌపతి, రామవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి. శ్రీనివాసరావు, ఏఎన్‌ఎంలు కె. కవిత, బి. తార, పి. జ్యోతి, ఫార్మసిస్ట్ ఎం. రేణుక, ఆశ కార్యకర్త భవాని అలాగే ఆర్‌బీఎస్‌కే సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Sept 2026 | 03:59 PM IST
Tags: