న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన వర్గపోరు, ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలో టీఎంసీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదంపై మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకుని అంశాన్ని తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసను విచారించింది. పార్టీ పేరు మరియు గుర్తును కోల్పోవడంపై బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీఎంసీకి చెందిన రెండు వర్గాలు తమతమ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం ముందు నాలుగు వారాల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. టీఎంసీ పేరు మరియు పార్టీ సింబల్ను ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ కోర్టును ఆశ్రయించగా, ఇప్పటికే ఈసీ రెండు వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులను కేటాయించింది. అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజినగర్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.


