న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలు రూ.2 వేలు దాటితే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయనున్నట్లు కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఇవాళ కేంద్రంతో పాటు ఆర్బీఐ, ఎన్పీసీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కమర్షియల్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ రిట్ పిటిషన్ను అడ్వకేట్ అంజన్ దత్తా తరఫున స్వీకరించి విచారించింది.
సెప్టెంబర్ 14, 15 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన గెజిటెడ్ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా ఎండీఆర్ పన్నుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రంతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది చట్టపరంగా చిన్న సమస్యగా అనిపించినా, సాంకేతికంగా పెద్ద సమస్యగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎండీఆర్ వసూలు చేయాలనుకోవడం పన్నా లేక ఫీజా అని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ ఇది ఫీజు కాకపోతే అటువంటి ఆదేశాలు ఎందుకని నిలదీసింది.
వ్యాపారిపై ఎండీఆర్ను వసూలు చేయాలనుకుంటున్న కేంద్రం ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.2 వేల ట్రాన్స్ఫర్ దాటితే అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు నిర్ణయించిన తరుణంలో, కోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.


