శంషాబాద్: లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై గతంలోనే లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో, విదేశాల నుంచి వస్తున్న క్రమంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో ఆమెను భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

లండన్‌లో ఉపాధి కల్పిస్తామంటూ నందన దంపతులు పలువురి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని, ఆ తర్వాత ముఖం చాటేశారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నందన దంపతులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆమె దేశం విడిచి వెళ్లకుండా లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేయగా, తాజాగా ఎయిర్‌పోర్టులో పోలీసులకు చిక్కింది. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 08:22 PM IST
Tags: