వెబ్ డెస్క్: జపాన్‌లో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోటో హషిమోటో అనే జపాన్ మహిళ ఏకంగా 7వ బిడ్డకు జన్మనివ్వడం అక్కడ సంచలనంగా మారింది. దేశం కోసం మహిళలు పిల్లల్ని కనాలని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా బలమైన పిలుపునిచ్చారు. ‘నేను 7వ బిడ్డకు జన్మనిచ్చాను. జపాన్ పౌరుడిగా ప్రయాణం ప్రారంభించిన నా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నా నిర్ణయానికి మద్దతు ఇచ్చి అండగా నిలబడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన దేశం అత్యంత కీలక దశకు చేరుకుంది. జపాన్ మహిళలు పిల్లల్ని కనాలి. మన దేశ ఉత్తానపతనాలు పూర్తిగా మహిళలపైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యలపై కూడా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, వివాహం కోసం తోడు కోసం వెతుక్కుంటున్న వారిని ఆకర్షించేందుకు కాస్మెటిక్ సర్జరీలపై కూడా ప్రభుత్వ నిధులు వెచ్చించాలని వినూత్నంగా సూచించారు. ఇలాంటి చర్యల ద్వారా జనాల ఆకర్షణీయత పెరుగుతుందని, ఫలితంగా పెళ్లిళ్లు చేసుకునే జంటల సంఖ్య పెరిగి క్రమంగా సంతానోత్పత్తి రేటు కూడా పెరుగుతుందని ఆమె వివరించారు. ఇలాంటి వ్యాఖ్యలు వివాదాలకు (కాంట్రవర్సీకి) దారి తీసే అవకాశం ఉందని ముందే తెలిసినప్పటికీ, తాను ఏమాత్రం వెనకాడకుండా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా పంచుకుంటున్నట్టు ఆమె స్పష్టం చేశారు.

అధికారిక జపాన్ గణాంకాల ప్రకారం, గతేడాది అక్కడ కేవలం 6.71 లక్షల మంది మాత్రమే జన్మించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో జననాల సంఖ్యలో ఏకంగా 15 వేల మేర కోత పడింది. వార్షిక జననాల సంఖ్య తగ్గడం ఇది వరుసగా ఏడో సారి కావడం గమనార్హం. 1899 తర్వాత అత్యంత కనిష్ట జననాలు 2025లోనే నమోదయ్యాయి. ఒక దశ తరువాత జనాభా తగ్గుదలను పూర్తిగా నిలువరించడం దాదాపుగా అసాధ్యమని జనాభా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటును తిరిగి గాడిన పెట్టేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు మహిళలకు పలు రకాల ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడం గమనార్హం.

Read latest Viral News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 08:12 PM IST
Tags: