హైదరాబాద్: హెల్త్ ఇన్నోవేషన్స్‌కు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఐటీ, వైద్యారోగ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీని జోడించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ‘హోమా CME 2026’ జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ‘ది న్యూ పారాడైమ్’ పుస్తకంతో పాటు, ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ అయిన ‘మెట్రిక్ ఎక్స్‌ప్లోరర్’ను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఎంపిక చేసిన 50 మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్ అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు మరియు స్టార్టప్‌లను హెల్త్‌కేర్ సేవలతో సమర్థవంతంగా అనుసంధానం చేస్తున్నామని, దీని ద్వారా హైదరాబాద్‌లో ఒక సమగ్ర హెల్త్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు పెరుగుతున్నాయని, వీటిపై వైద్య నిపుణులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. లైఫ్‌స్టైల్ డేటా విశ్లేషణ ద్వారా వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హెల్త్‌కేర్ రంగంలో వచ్చే ప్రతి కొత్త ఆలోచనకు, నూతన ఆవిష్కరణలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వైద్య నిపుణులు, పరిశోధకులు ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.


