షాద్‌నగర్: నియోజకవర్గ రైతులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు ప్రాణం పోస్తుంటే విమర్శలు చేయడం ఏంటని గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు మండిపడ్డారు. పదేళ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తిగా విస్మరిస్తే అప్పుడు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల నాయకుల్లో ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్తశుద్ధితో రిజర్వాయర్‌కు రూపం కల్పిస్తుంటే ప్రశ్నిస్తున్నారని, ఇంతకు వీరు ప్రజా సంఘాల నాయకులా? లేక బీఆర్ఎస్ వర్గంలో పనిచేస్తున్నారా? అని ఆయన సోమవారం మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, జిల్లా నాయకులు ఎండీ ఇబ్రహీం, యువజన కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఖదీర్, షర్ఫుద్దీన్, గంగా తదితరులతో కలిసి ఆయన షాద్‌నగర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నీటి విషయంలో ప్రజా, విద్యార్థి, పౌర హక్కుల సంఘాల నాయకులు స్పష్టత కోరేలా లేరని, సంబంధం లేని అంశాలను పుట్టించి ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే పట్టించుకోని నాయకులు ఇప్పుడు అదానీ డేటా సెంటర్ కోసం నీటిని కేటాయిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలతో ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు. పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్లుగా వారి తీరు ఉందని దుయ్యబట్టారు.

గతంలో కుర్చీ వేసుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తానని అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించినా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని గుర్తుచేశారు. ఆనాడు ప్రశ్నిస్తే అరెస్టు చేసే సంప్రదాయం ఉండటంతో భయపడిన సంఘాల నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకుని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎన్నికలకు ముందే రిజర్వాయర్ కోసం పోరాడటమే కాకుండా, ఎన్నికలయ్యాక నేరుగా ముఖ్యమంత్రిని కలిసి భూసేకరణ కోసం సుమారు రూ. 600 కోట్ల వరకు కేటాయింపులు జరిగేలా ప్రత్యేక కృషి చేశారని స్పష్టం చేశారు.

ప్రజలకు అనుమానాలు ఉంటే తామే వివరిస్తామని, ప్రజా సంఘాల ముసుగులో ప్రతిపక్ష పార్టీలా వ్యవహరిస్తున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన దళితులకు మూడెకరాలు, దళితుడిని సీఎం, కేజీ టూ పీజీ, మైనార్టీ రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలేవీ అమలు కాలేదని, ఆనాడు కేసీఆర్ మొహం చాటేస్తే ఈ సంఘాలన్నీ ఏమైపోయాయని రఘు నిలదీశారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ కూడా గత ప్రభుత్వ హయాంలో మంజూరైందేనని, కమ్మదనం గురుకులంలో విద్యార్థి ఆత్మహత్యను సైతం రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నం చేసి విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 03:31 PM IST
Tags: