షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొని, స్థానిక ఎంపీడీవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, ఉచిత స్కూటీలను తక్షణమే అందించాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన రూ. 4,000 పింఛన్ సకాలంలో అమలు చేయాలని కోరారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా, పంట బోనస్, నిరంతర ఉచిత విద్యుత్ కల్పించడంతో పాటు రైతు కూలీలకు ఏటా రూ. 12,000 అందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో పూర్తిగా ఆగిపోయిన పారిశుద్ధ్య నిర్వహణను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ నాయకులు టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 01:47 PM IST
Tags: