నల్లగొండ: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన దాడి, ప్రతిదాడులు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు తెరలేపాయి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయగా, దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రతిదాడికి యత్నించాయి. పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వైపు హస్తం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయంపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడిని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలతో భౌతిక దాడులకు తెగబడటం సరికాదని ఆయన హితవు పలికారు.

క్లాక్‌టవర్‌ వద్ద కాంగ్రెస్ నిరసన

అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు క్లాక్‌టవర్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి నిరసన చేపట్టి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత చేయి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించి, ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతో నల్లగొండ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Aug 2026 | 08:15 PM IST
Tags: