బూర్గంపహాడ్: ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ బిడ్డ, నర్సు శిరీష మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బూర్గంపహాడ్ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి శిరీష మృతికి సంతాపంగా మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా (నర్సుగా) నిరంతరం సేవలందించిన శిరీష మృతిపై అనేక అనుమానాలున్నాయని, హత్య చేసిన వారిని వదిలిపెట్టవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులకు కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిరీష పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షస్తూ ఘనంగా నివాళులర్పించి, ప్రగాఢ సంతాపం తెలిపారు.


