ఫిల్మ్ డెస్క్: టాలీవుడ్ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ పరిధిలోని డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో డ్యాన్సర్ల అందరి అభిప్రాయాలను సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ వెల్లడించింది.
ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు. ఈ భేటీలో సుమలత, రఘు మాస్టర్‌తో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు డ్యాన్సర్ల మద్దతు ఎంత ఉందనేదానిపై బహిరంగంగా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో సుమలత వర్గానికి కేవలం 11 మంది మాత్రమే మద్దతు తెలపగా.. రఘు మాస్టర్‌కు మాత్రం అత్యధికంగా 214 మంది డ్యాన్సర్లు తమ బలపరిచారు.
సభ్యుల నుంచి భారీ స్పందన, మెజారిటీ మద్దతు రఘు మాస్టర్ వైపు ఉండటంతో.. సుమలత ఆధ్వర్యంలోని ప్రస్తుత డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అంతేకాకుండా, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు పారదర్శకంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు వచ్చే నెల అక్టోబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారికంగా తేదీని ఖరారు చేశారు. ఈ ఎన్నికల ద్వారా నూతన కార్యవర్గం కొద్ది రోజుల్లోనే అసోసియేషన్ బాధ్యతలు చేపట్టనుంది.


