హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులకు ఎదురవుతున్న అడ్డంకులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులు ఎక్కడా ఆగకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధన్‌సరి అనసూయ (సీతక్క) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు అందాయి.

నూతన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై బిల్లుల చెల్లింపుల విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య తలెత్తే వ్యక్తిగత లేదా ఇతర విభేదాల కారణంగా చెక్కులపై సంతకాలు ఆలస్యం కాకుండా నిబంధనలను కఠినతరం చేశారు. చెక్కులపై సంతకం చేయాల్సిన ఉప సర్పంచ్ సరైన కారణం లేకుండా జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

7 రోజులకు మించితే విచారణ.. కలెక్టరుకు అధికారాలు

ఉప సర్పంచ్ ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండా ఏడు రోజులకు మించి చెక్కులపై సంతకం చేయకుండా జాప్యం చేస్తే, సంబంధిత జిల్లా కలెక్టర్ తక్షణ విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ విచారణలో ఉద్దేశపూర్వకంగానే సంతకం చేయకుండా పనులను అడ్డుకుంటున్నట్లు తేలితే, సంబంధిత నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, సంతకాల విషయంలో అనవసర జాప్యం కొనసాగితే గ్రామాల్లో అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైన అత్యవసర సందర్భాల్లో ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో (MPO) లేదా ఎంపీడీవోల్లో (MPDO) ఒకరికి జాయింట్ చెక్ పవర్ కల్పించేలా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఈ తాజా నిర్ణయంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు వేగవంతం కావడంతో పాటు, చెక్కుల సంతకాల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Oct 2026 | 10:51 PM IST
Tags: